Tuesday, 17 November 2015

త్రిపదాలు : 81 to 100

81. మాటలెన్నని మూటకట్టాలో..
కన్నులతో సంభాషిస్తూ..
మౌనమంటే నీకు మక్కువన్నందుకు..
82. మరచిపోయిన మాటలే అన్నీ..
నువ్వున్నప్పుడు నా ఆనందాలనుకున్నవి..
నీ వియోగంలో విషాదాలుగా మిగిలి..
83. మాటలతో పనేముంది..
జ్ఞాపకాలను నెమరేసుకొనే నాకు
స్వప్నాలే సన్నిహితమయ్యాక..
84. కొన్ని మౌనాక్షరాలను మాటలుగా మార్చా
నా మనసు నీకందించాలని..
నా గుండె చప్పుడు నీకు వినిపించాలని
85. చంద్రమండలానికి చేరువైనట్లుంది
నీ మాటలు మంత్రాలై వినిపిస్తుంటే
కళ్ళలో పెళ్ళిపందిరి కనబడుతుంటే..
86. నేనిపూడో మూగబోయిన తీగనే..
సవరించాలనుకుంటే జారిపోతూ..
వినిపించాలనుకుంటే అపశృతిగా మారిపోతూ..
87. నన్ను నేను కోల్పోయిందప్పుడే
నీ మాటలతో మంత్రించాక..
నే మాయలో మునిగిపోయాక..
88. క్షణాలకూ అతిశయమే..
కదలమన్నా ఆగి ఆగి నిలబడుతూ..
సహనాన్ని సాయమడిగేలోగా యుగాలై వేధిస్తూ..
89. పదాలకు ఊపిరి పోస్తున్నా..
అక్షరాలుగా అలంకరించి..
వాక్యాలుగా అమరిపోయి త్రిపదాలుగా వర్ధిల్లమని..
90. నీలాకాశం చీరయ్యింది..
మగువ మలుపులను అల్లుకోవాలని..
కొన్ని కళ్ళనైనా ఆకట్టుకోవాలని..
91. ఎన్ని భావ సంచలనాలో..
అక్షరాల మేళవింపులో..
కొన్ని సంకలనాలై మిగలాలని..
92. మౌనమలా ముసుగేసుకుంది..
నీ పలకరింపు చేరని హృదయానికి..
స్వేచ్ఛతో పనేముందని..
93. అక్షరాల మల్లెలే అన్నీ..
భావాల మాలలో చేరి
త్రిపదమై పరిమళించాలని
94. ఎన్ని కలలు దాచుకున్నానో..
అక్షరంగా మార్చి..అమరత్వాన్నద్ది
ఎప్పటికీ మిగిలిపోయే కీర్తిగా వెలగుతాయని..
95. మౌనం గలగల నేర్చింది..
నీ ప్రేమ సెలయేరై పిలవగానే..
సరికొత్త రాగాలను వల్లించుకుంటూ..
96. అవకాశం అంది పుచ్చుకున్నా..
ఆకాశమే నా హద్దని నిశ్చయించుకున్నాక..
అనుమానాలన్నింటినీ పక్కకు నెట్టి..
97. ఎంత వేడిగా పుట్టుకొస్తాయో..
జ్ఞాపకాల వెల్లువలోని కన్నీళ్ళు..
హృదయాన్ని అమాంతం కోసేస్తూ..
98. వింటున్నానదిగో..
ఊసులాడుతున్న పువ్వుల గుసగుసలని..
మన గురించి ఏమంటున్నాయోనని..
99. ముసురేస్తే గుబులే మరి..
తరలిపోయిన మేఘాలు తిరిగొచ్చి..
ఎటు ముంచుతాయోనని..
100. అనురాగం జల్లై కురిసింది..
ఆకాశమంత ప్రేమయ్యిందో..
ఆపుకోలేనంత ఆనందమయ్యిందో..

No comments:

Post a Comment