Tuesday, 17 November 2015

త్రిపదాలు : 341 to 360

341.ఆ తాళం గుట్టెప్పటికీ తెలీదు..
జీవితం అంచుల్లోకి చేరుకున్నా..
ఆనందపు రహస్యాన్ని కనిపెట్టలేక..
342. బంగారమంటే మక్కువయ్యిందిప్పుడే..
నీ పిలుపులోని సౌహార్దానికి..
మనసు మెరిసినట్లయ్యి..
343. ఎన్నడో ముక్కలైన మనసు..
ఈనాడు అతికించాలని చూసినా..
తునాతునకలయ్యాక అతకడం కష్టమే
344. మెరిసి ఆగుతున్న ఆకాశాన్ని చూస్తున్నా..
తడిచిన నా అందాన్ని..
మెరుపులతో బంధించాలని వచ్చిందని..
345. కన్నీటి చారలే మిగిలాయి..
నువ్వు ముచ్చటపడ్డ చెక్కిళ్ళ మీద
నవ్వులు ఇగిరిపోయాక..
346. సముద్రాలే వెనక్కి పోతాయేమో..
కొన్ని హృదయాలు దాపుకొస్తే..
ఆ ఉప్పునీరు కూడా విషపూరితమవ్వగలదని..
347. కన్నీరు ఆగలేదు..
నిన్ను చూసిన క్షణంలో..
తనకో అస్తిత్వం ఉందని మరచి..
348. మనసు..
నిత్యం నీ జ్ఞాపకాలతో ఊరేగు విహంగం..
పరిమళించు సౌరభాల కల్లోలం..
349. నిచ్చెనతో పనేముందిక..
విజయాన్ని అందుకొని ఆకాశాన్ని అధిరోహించాక..
చుక్కలతో నేస్తం కట్టి చెలిమిని మరచినవారికి..
350. నీడనై అనుసరించింది నేనే..
నువ్వు ముందు కదిలినప్పుడు
నీ అడుగులను కొలుచుకుంటూ..
351. నీవేగా నా మనోరధం..
నన్నూహల్లో తేలించు వేళ..
చైత్రమై విచ్చేసింది..
352. మండుతున్న గుండెనడుగు..
గ్రీష్మమెంత చల్లనో..
నీ వియోగపు యాతన ముందు..
353. అక్షర సోయగమే సౌందర్యం..
భావాల జాతరలో ఆనందం..
అనుభూతులూ పదాలూ కలగలిసిన త్రిపదం..
354. వానలో తడవాలనిపించింది..
కాగితప్పడవలోని ప్రయాణాన్ని నెమరేసేందుకు..
చిలిపిదనాన్ని తడుముకు గంతులేసేందుకు..
355. మనదో రంగుల ప్రపంచమే..
మదిలో వసంతాన్ని కలగంటూ..
మనసులనాకర్షించాలని చూస్తూ..
356. నీ అడుగులో అడుగేసిన రోజులు..
స్మృతులైతేనేమి..
నా పెదవంచున పూయించెను చిరునవ్వులు..
357. పలుకు చిలక కులుకు..
అనునయానికని గారాలొలుకు..
అలుకను అందుకే ఉసిగొలుపు.. 
358. రెండూ సమానమేనేమో..
కలలకు అర్ధాలు మారిన క్షణాలు..
నీ ఎదురుచూపుల్లో ఓడిన నయనాలు..
359. చిరుజల్లై కురవరాదా..
తాపమిలా మెలిపెడుతుంటే..
దిక్కులు చూస్తూ నిలబడతావా..
360. జ్ఞాపకాలంతే..
కొన్ని సజీవంగా ఓదార్చుతాయి..
ఇంకొన్ని మచ్చగా మిగిలిపోతాయి..

No comments:

Post a Comment