Tuesday, 17 November 2015

త్రిపదాలు : 461 to 480

............................... *****************.............................
461. లోటుపాట్లపై దృష్టి సారించలేదు..
నీ మనసద్దంలో చూసుకుంటూ..
మన ప్రేమకు మురిసిపోతూ..

462. అంతులేని వ్యధలెన్నో జీవితంలో..
అంతులేని కధలకు శ్రీకారమవుతూ..
అంతమవని ఆవేదనకు అద్దంపడుతూ..

463. నాకు మాత్రమే తెలిసిన నిజం..
మన లోకమో అందాల బృందావనమని..
రాధామాధవులం మనమిరువురమేనని..

464. మువ్వలన్నీ ఏకం చేసాను..
రాగాలాపనలో నాకు జతపడతాయనే..
స్వరార్చనతో నిన్ను మెప్పించాలనే..

465. శ్యామలమైన నేత్రాలేగా నీవి..
ఎడారివంటి మనసుకి సజలాలను పంచకపోయుంటే..
ఒకరి బాధను నీవు స్వీకరించకుండా ఉండుంటే..

466. ఎడారిపువ్వును మరపించాయి..
సూటిగా మనసును గుచ్చేస్తూ నీ పెదవంచు నవ్వులు..
ఆయుధం పట్టకుండానే నన్ను చంపేస్తూ..

467. నిన్నటిదాకా ఎడారికోయిలనే..
నీ వలపు మేఘమై కురిసి వానకోయిలగా మార్చేసిందిగా..
తీయని పాటకు వేళయ్యిందని తొందరపెడుతూ..

468. సహనం చేదవుతోంది..
నీ నిరీక్షణలో క్షణాలు యుగాలవుతుంటే..
నీవొచ్చే జాడ కనపడక నే నీరవుతుంటే...

469. మనసు మురుస్తూనే ఉంది..
నీవేసిన ముంగిట్లో ముగ్గుకి..
రంగులద్దాలని వేచి చూసే నిరీక్షణలో..

470. ప్రకృతిని ఆస్వాదించే మనసేమో నీది..
ఎడారిలో లేని పచ్చదనాన్ని ఊహిస్తూ..
మనసుకి ఆనందాన్ని పంచుకుపోతూ..

471. తీరమై ఎదురు చూస్తున్నా..
కెరటమై దరి చేరతావని..
ఆశలకి రెక్కలిచ్చి ఎగరాలని...

472. కలలన్నీ కన్నీళ్ళ పాలే..
కల్లలు నిజమవుతుంటే..
కలలు దూరమవుతుంటే..

473. అక్షరయఙ్ఞాలు ఎన్ని చేస్తేనేమి..
మానవతకు అర్థం తెలియనివారికి..
మనిషి విలువను గౌరవించనివారికి..

474. వెన్నెలెంతగా కురిసిందో..
గోడచాటు కొండమల్లెలూ తడిసేట్టు..
ఎడారంటి మనసూ చిగురించేట్టు..

475. మనసుని మాత్రమే ఆరాధించాను..
జీవితాన్ని బలికోరని నేను..
ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలనే..

476. నక్షత్రాలు నక్కిపోయాయి..
మేఘాల మాటు చాటు చూసుకొని..
రేరాజు పిలిచినప్పుడే తిరిగొద్దామని..

477. జడకుచ్చునే కుంచెగా చేసా..
ప్రకృతిని చిత్రించాలని..
అందాన్ని బంధించి నిన్ను మెప్పించాలని..

478. గాలి అలల సవ్వడీ తోడయ్యింది..
వానచినుకుల విలాసానికి..
ఇలచేరి పులకించిన హృదినర్తనమేదో చూడాలని..

479. కనుసైగలూ కావ్యాలే..
కావ్యనాయికవే నీవైతే..
నా కలానికే జీవం అందిస్తే

480. అభిమానం నిలబెట్టుకోవడం రావాలి..
అనుమానాన్ని నిద్రపుచ్చి..
అనుబంధం గెలుచుకోవాలంటే..

.............................. *****************.............................

No comments:

Post a Comment