Tuesday, 17 November 2015

త్రిపదాలు : 301 to 320

301. కంటి కాటుకలే కాపలా..
ఆమె కనుపాపల అల్లరికి..
కొంటెచూపుల తాకిడికి..
302. ఆ నవ్వులకర్ధం మారింది..
బాల్యం పరుగెత్తి పోయాక..
ఓపలేని వయసొచ్చి మీదపడ్డాక..
303. అనుభూతులు వెల్లువై అల్లుకుంటాయి..
నీ చిలిపిదనాలు..
కన్నుల్లోంచి ప్రవహించినప్పుడల్లా..
304. కొన్ని ప్రమాదాలను తట్టుకోక తప్పదు..
భారమెత్తిన సహనం నశించిపోయి..
అలసిపోయిన ప్రకృతి తిరగబడ్డాక
305. మనసుకిప్పుడే సాంత్వనయ్యింది
జాబిలి చల్లగా తడిమినట్లయిన
నీ చూపుల లేపనాలతో..
306. ఒక భావం పరిమళించింది..
పువ్వుగా నేను రాసినందుకో..
అత్తరని నువ్వు మెచ్చినందుకో
307. చిరునవ్వు సంతకం చేసేసా..
నీ అధరాలు విచ్చుకోగానే
నాకోసమేనని మనసంటే
308. అనుభూతిగా మలచుకున్నా..
అపురూపంగా నువ్వు పంపిన లేఖలన్నీ..
అనుబంధానికి కానుక చేద్దామని..
309. భాష్పమనుకున్నా ఇన్నాళ్ళు..
నీ సంతోషంలో ముత్యమై రాలిన చినుకు..
ముత్యమై మురిపించేదాకా..
310. ప్రతిసారీ నేనేగా..
నువ్వంటే నేనున్నానంటూ..
ప్రతి కవనంలోకి నడిచొస్తూ
311. చూపుల వలలో చిక్కిపోతానేమో..
చిరుతనవ్వులతో నువ్వుంటే
పరవశాన్ని గుండెల్లో దాచుకోలేక..
312. ఒక్క సిరా చుక్క చాలు..
అందమైన అనుభూతిని అక్షరాలుగా మలచడానికి..
ఆపై కవనవనం పరిమళించడానికి..
313. పులకింతలను పాడుకుంటున్నా..
నీ నెమరింతల్లో వలపు వెచ్చబడగానే..
పరవశాన్ని దిద్దుకుందామని..
314. ఆశనిరాశల లోలకంలోనే జీవితం..
ఆగిపోతున్న శ్వాసనీ..తరలిపోతున్న వసంతాన్నీ
వెనక్కు రప్పించాలనే ఆరాటం..
315. నెలవంక విరిసినట్లయ్యింది
నీ పెదవుల ఒంపు కదలికలో
నా తలపును మనసూహించగానే..
316. అనుపల్లవిగా మారుతున్నా..
పల్లవిగా నువ్వెదురైన క్షణాన
సంగీతానికో భాష్యాన్ని కనుగొనాలని.. 
317. ఆనందపు పర్యవసానం విషాదమేగా
నవ్విన మలిసందెల జ్ఞాపకాలలో
అనుభూతుల గంధాలు మెలిపెడుతుంటే
318. అనురాగమే కొలమానం..
నన్ను చేరదీసిన నీ హృదయానికి..
చాలదుగా ప్రేమాభిషేకం..
319. మరపురాని కధలెన్నో మదిలో..
రేయైతే నిట్టూర్పుల సెగలో
నేత్రాలను కన్నీటి ఊటలు చేసేస్తూ..
320. నా మోము వెలిగిందో దివ్వెలా
దీపావళి రాతిరి నాటి కాంతిలా..
మైమరపు నీకెందుకో..అరనవ్వులు నావైతే..

No comments:

Post a Comment