Tuesday, 17 November 2015

త్రిపదాలు : 521 to 540

 ............................... *****************.............................

521. తప్పని జీవిత ప్రయాణమే..
ఒకరు దిగితేనే మరొకరికి చోటు దొరికేది..
ఒకరు కదిలితేనే మరొకరు నిలబడగలిగేది..

522. జీవితం నందనవనమే..
అనుభవాన్ని అనుభూతిగా మిగుల్చుకుంటే..
అనుభూతిని భావముగా దాచుకోగలిగితే..

523. మనసెప్పుడూ చంచలమే..
మౌనానికి మాటలు నేర్పమంటూ అప్పుడప్పుడూ..
మాట్లాడితే మౌనం పాటించమని కసురుతూ ఒక్కొప్పుడు..

524. ప్రకృతెప్పుడూ కన్నులపండుగే..
పలురంగుల విన్యాసాలతో మురిపిస్తూ..
మనసును రాగరంజితం చేసేస్తూ..

525. అందెలన్నింటిలో నీ సవ్వడే..
మువ్వల మురిపెంలో ఒదిగావేమో..
మనసువేదికపై నృత్యమాడి నన్నలరిస్తూ..

526. ముత్యమై ఒదిగిపోయా గుండెల్లో..
ఆల్చిప్పవై చేయి చాచావనే..
సముద్రగర్భాన్ని సైతం లెక్కచేయక..

527. నిన్నటి ఊపిరి పీల్చడం మానేయాలి..
నగ్నత్వపు నునుపును పరిశీలించడం మానాలంటే..
కాలానికనుగుణంగా పరిగెత్తాలంటే..

528. ఏమార్చలేక నీరసించింది మనసు..
ఓదార్చుదామన్నా ఓటమే మిగులుతుంటే..
నీకు గెలిచే ఉద్దేశ్యం లేదని భావించినందుకే..

529. ఊగిసలాటే జీవితం..
నొప్పించక తానొవ్వక మిగలాలనే ఆరాటంలో..
ఆ నలుగురినీ మెప్పించలేక తానోడిపోతూ..

530. నీ గమ్యం నేనేగా..
పయనం నా కొరకైతే..
తెరచాపనై దరిచేర్చగా..

531. బదులివ్వలేని నా మౌనం...
చెలిమిని శాశ్వతం చేయాలన్న ఆలోచనలోనే..
నెచ్చెలిగా నిత్యం నిలిచిపోవాలనే సంకల్పంతోనే..

532. చిరునవ్వుల తొలకరి కురిసినట్లుంది..
కలలో నీవు కల్లాపి చల్లుతుంటే..
మనసు ముత్యాలముగ్గులు ఆశిస్తుంటే..

533. కలలిక్కడ..కధలక్కడ..
కలతలిక్కడ..సంబరాలక్కడ..
మౌనమిక్కడ..ముచ్చట్లక్కడ..

534. అపురూపమై మెరిసింది..
నా కన్నులందు నీ రూపం..
సిరివెన్నెలను సైతం మించి వెలిగిందనే..

535. మనసు కలువకెంత సంబరమో..
నీ ఆశలను రెక్కల్లో దాచుకుంటూ..
నా తలపులను నీకు తోడుగా పంపిస్తూ..

536. సంపెంగి పరిమళం మదిని తాకింది..
నీ సొగసుని పూసుకొని వీచిందేమో..
ఏమరపాటుగా వీచిన చిరుగాలి...

537. మౌనం కాదిది..
అణుచుకోలేని ఆక్రోశం..
పెదవిచాటున ఉరకలెత్తే ఉక్రోషం..

538. అతుకు వేయలేని నీ జ్ఞాపకాలు..
వేళాపాళాలేక మనసును చిందరవందర చేసేస్తూ..
అంతరంగాన్ని అతలాకుతలం చేసేస్తూ..

539. భావమెరుగని కన్నీరే అది...
భాష్పంగా మారి రాలిపోతూ..
చెక్కిళ్ళపై చారికగా మిగిలిపోతూ..

540. బతకనేర్చినోడే నాయకుడు..
స్వాతంత్ర్యాన్ని పూర్తిగా పుస్తకాలకే పరిమితంచేసి..

ఆచరణలో అర్ధాలు మార్చేస్తూ


 ............................... *****************.............................

No comments:

Post a Comment