Tuesday, 17 November 2015

త్రిపదాలు : 241 to 260

241. ఆకాశంలో నక్షత్రాల్లా నా రాతలు..
నీ హృదయంలో మెరుపవ్వాలని..
నీకు నిత్యవెలుగులు పంచాలని..
242. తప్పనుకోవడమెందుకు..
నమ్మి మోసపోయానని తలుచుకుంటూ..
నమ్మడం నీ నైజమైనప్పుడు..
243. మలుపు తిరిగిన గమనమొకటి..
గమ్యం నీవై ఎదురుకాగానే..
తడబాటు దూరమై అడుగులేస్తూ..
244. రాలుతున్న కలలు కొన్ని..
నీ మౌనాన్ని అనువదించుకోలేక..
ఆశల ఉసురు తీసి సమాధానపడలేక..
245.  ఓటమికి వెరుపెందుకో..
సంకల్పం చేయిపట్టి నడిపిస్తుంటే..
చీకట్లోనూ వెలుగుకిరణాలు ఎదురైనట్లుంటే..
246. తొలిమల్లె నవ్వినట్లుంది..
నీ చిరుతకన్నులు మాయ చేస్తుంటే..
నన్ను ఆవాహనం చేసుకున్నట్లు..
247. ముకుళించుకుపోతున్న నా క్షణాలు..
జ్ఞాపకాల్లో కనుమరుగవుతున్న నీ రూపం..
కన్నుల్లో కరిగి నీరైనట్లనిపిస్తుంటే..
248. నిన్నటి గాలులే అవి..
కవిత్వాన్ని తాగి వచ్చినందుకేమో..
నన్ను మైమరపులో ముంచేస్తూ..
249. దిక్కులు చూడకుండానే దిశను నిర్ణయించుకున్నా..
లక్ష్యం ఎదురుగా నిలబడిందని..
వేరే ఆలోచనలేవీ ఆపాలేదని..
250. కెంజాయివర్ణాలను నింపుకున్నా సంధ్యలు..
పగటిపై ఆగ్రహించినందుకో..
గోధూళి వేళకు తిరుగు ప్రయాణమవుతున్నందుకో..
251. చందమామను ముద్దాడాలనే కోరికేమిటో..
హేమంతపు చలిని ఆస్వాదిస్తూ..
గిలిగింతలు కేరింతలు కొడుతుంటే..
252. సజీవమవుతున్న కలలు కొన్ని..
ఊహలకి బలం చేకూరినందుకో..
ప్రేమలోని నిజాయితీ గెలిచినందుకో..
253. ఎందుకన్ని నిర్లక్ష్యాలో..
ఒకే కక్ష్యలో తిరిగే జీవితాలు..
కొత్తదనం కోరుకోని అశాంతి హృదయాలు..21
254. అనంతమవుతోంది కాలం..
క్షణాలను ఆపలేని నిస్సహాయతలో..
లెక్కందని రోజులన్నీ ఉరకలేస్తుంటే..
255. అవే కతలు మళ్ళీమళ్ళీ నన్ను కవ్విస్తూ..
నింగిలోని నీలాల మాదిరి..
నీ చూపులోని గారాల్లోనైనా..
256. హేమంతప్పుడూ సౌఖ్యమే..
వెచ్చని నెచ్చెలి కౌగిలిలో..
హృదయం కంపించే భావనలో..
257. కంటి కాటుకలే కాపలా..
ఆమె కనుపాపల అల్లరికి..
కొంటెచూపుల తాకిడికి..
258. ఆ నవ్వులకర్ధం మారింది..
బాల్యం పరుగెత్తి పోయాక..
ఓపలేని వయసొచ్చి మీదపడ్డాక..
259. అనుభూతులు వెల్లువై అల్లుకుంటాయి..
నీ చిలిపిదనాలు..
కన్నుల్లోంచి ప్రవహించినప్పుడల్లా..
260. కొన్ని ప్రమాదాలను తట్టుకోక తప్పదు..
భారమెత్తిన సహనం నశించిపోయి..
అలసిపోయిన ప్రకృతి తిరగబడ్డాక

No comments:

Post a Comment