Tuesday, 17 November 2015

త్రిపదాలు : 361 to 380

361. కుసుమిస్తున్న భావాలు నాలో..
ఈరేయి నిద్దురలేదందుకేనేమో..
ఊహలు పల్లవిగా మారాలని చూస్తుంటే..
362. దినదినమో గండం..
నువ్వు లేని నా జీవితం..
మబ్బు పట్టిన ఆకాశమేనన్నది నిజం..
363. జడలిప్పుకున్న సంతోషాలు..
నా కిటికీ లోంచీ ఆకాశం..
ముసురేసి నన్ను కవ్వింతకు రమ్మంటుంటే..
364. అద్దమంటేనా..
నన్ను నాకు చూపి 
ఆశను గెలవమని ప్రోత్సహిస్తూంటుంది..
365. మేఘమెటో కదిలిపోయింది..
నా కంటి మెరుపులో నీ రూపు చూసిందో..
కురిసినా తడపలేనని విస్తుపోయిందో..
366. గుడిలో కెళ్ళడం మానుకున్నా..
మెట్లపై దర్శనమిచ్చిన దేవుడికి
దక్షిణలక్కడే సమర్పించి..
367. నీలో నిన్ను వెతుక్కుంటావెందుకో..
నన్ను దాచిపెట్టి
మనసుకి తాళమెట్టి..
368. వెన్నెలొచ్చి గుర్తుచేసింది..
అమ్మ చేతి వెన్న ముద్ద.. 
ఈనాటికి రుచి తగ్గని గోరుముద్ద..
369. పదాల్ని పొమ్మంటానైతే..
భావాలు వెంటపడ్డాయని
కవిత్వాన్ని విసుక్కున్నావంటే..
370. అక్షరమందుకే బ్రతికే ఉంది..
మదిలో ఖళీ పూరించేందుకు..
అమ్మ లేని లోటును తీర్చేందుకు..
371. ప్రణయాన్ని పల్లవించని పెదవులు..
ప్రళయాన్ని పాడేందుకు సిద్ధమవుతాయెందుకో..
తీరాన్ని అలలతో విడదీస్తూ..
372. నేనో క్షణాన్ని..
నన్నో కాలంతో పోల్చినప్పుడు..
నిరీక్షణలో మాత్రం యుగమవుతూ..
373. ఎందర్ని ఒదులుకున్నానో..
నీ ఒక్క చెలిమితో..
జీవితాన్ని ఆవిష్కరించుకుందామని..
374. చుక్కల్లేని చంద్రోదయం..
పగలనుకున్న జాబిల్లి..
రాతిరిలో తలంటుకున్నందుకే..
375. తెల్లమొహమేస్తావెందుకో..
ఏదో అడగరానిది అడిగినట్టు
పాపైన ప్రేమకేం పేరు పెడదామనేగా నేనడిగింది..
376. ఊయలూగుతూ చూస్తోంది చంటిపాప..
తను కలగన్న వెలుగు బంతి
ఆకాశంలో చందమామలా కదులుతుందేంటని..
377. ప్రేమనే కలవరిస్తావ్..
ప్రేమంతలా పెరుగుతున్నా..
ప్రేమనింకా అనుభూతించలేదని..
378. నేనాకాశమైన ప్రతిసారీ..
నీ వెతుకులాట మొదలవుతుంది..
నక్షత్రాలింకా మెరవలేదేంటాని..
379. ప్రతిపున్నమీ తొలిరాత్రే..
చందమామలా తను ఎదురవుతుంటే..
సిగ్గుని దాచేదెలాగో తెలీక..
380. అలలారుతున్న ప్రకృతి సౌందర్యంలో
కాలం కదులుతున్న ఆనవాళ్ళు
శిశిరానికి సమయమవుతుందనే విషాదంలో ఆకుపాటలు..

No comments:

Post a Comment