Tuesday, 17 November 2015

త్రిపదాలు : 1 to 20

1. మనసు పరిమళించడం తెలుస్తోంది..
తన తలపుల తాకిడికో..
కొన్ని జ్ఞాపకాల ఘుమఘుమలకో..
2. మనసును కొలుస్తున్నావెందుకో..
అనురాగం ఆధారమై కలిసున్నాక..
హృదయాలెన్నడో పెనవేసుకున్నాక..
3. ఊసులతో మైకమివ్వడం నీకు తెలుసేమో..
అవ్యక్త భావాలతో అభిషేకిస్తూ..
అపురూపాన్నని గుర్తుచేస్తూ..
4. వానాకాలంతో పనేముందనిపిస్తుంది..
నీ తలపుల జల్లులు నాపై కురుస్తుండగా
వేరే ప్రణయ ప్రవాహం పలకరించడమెందుకని..
5.  కలలోనే చేరువవుతావెందుకో..
వాస్తవంలో వద్దకు రానంటూ..
వరాలన్నీ తీరని తృష్ణలేనంటూ..
6. ఊసులెన్ని మూటగట్టాలో..
నీ ఊహలోనూ నవ్వించాలంటే..
నీ కన్నీటితడిలో నేను కనబడాలంటే..
7. కొన్ని అనుబంధాలంతే..
అణువణువూ అన్నట్లే మొదలవుతాయ్..
చివరికి అణుబాంబులా బెదిరిస్తాయ్..
8. ఆగడమన్నదే తెలియదుగా కాలానికి..
గమ్యమేదీ లేకున్నా ముందుకే ఉరకలేస్తూ..
తనతో పాటూ మనల్నీ ముడేసి కలుపుకుపోతూ..
9. కన్నీరెప్పుడూ వెచ్చనే..
ఆనందంలో తీయగా..
విషాదంలో ఉప్పగా..
10. అక్షరం అద్దితే కలం..
వానాకాలమైనా వసంత కాలం..
అనుభూతి నర్తిస్తుందిగా రసాతలం..
11.  నీ తలపుతోనేగా నే బ్రతుకుతున్నా..
పగలంతా ఊహలతో..
రేయంతా కమ్మని కలలతో..
12. నీతోనే కలిసుంటా..
చిరునవ్వుల వరమే నువ్విమ్మంటే..
మనసు తెరపై నువ్వు నిలిచుంటానంటే
13. వెలుతురొకటి నిండింది..
శూన్యమనుకున్న హృదయంలో..
సాంత్వనిచ్చే నీ మాటలు మురిపిస్తుంటే
14. నిన్నే ప్రపంచమనుకున్నా..
నీ హృదయంలో చోటిచ్చాక..
వేరే మధువనమైనా ఒద్దంటూ..
15. నిద్దురపోవడం మానేసా..
కలలోనూ కన్నీరే కురుస్తుంటే..
నిరాశలన్నీ సెలయేళ్ళై ప్రవహిస్తుంటే
16. వెలుగు నీడల మయమేగా జీవితం..
ఆనందంలో వెన్నెలైతే..
విషాదం నీలిమను తలపిస్తూ..
17. ఎన్ని అనురాగాల 
విలీనమో..
మనలో ఈ యుగళగీతం..
18. రాధ నేనై రానా..
కృష్ణుడివై ఎదురు చూస్తూ నువ్వుంటే..
రేపల్లె మనదేనని నువ్వంటుంటే..
19. నీలమోహనమంతా నువ్వేగా
మహా సుందరమై అలలారుతూ
పద్మలోచన ముకుళాలతో..
20. మనసెంత మోహనమయ్యిందో..
నీలిమేఘమైన నిన్ను వరించి..
నీ ప్రేమకు నేను కైవసమవుతుంటే..

No comments:

Post a Comment