Tuesday, 17 November 2015

త్రిపదాలు : 641 to 660

 ............................... *****************.............................

641. మరణసదృశమేగా...
ఆ ఊపిరులలో ద్వేషమే నిండితే...
అపరిపక్వంగా మనసులో విషం చిమ్మితే..

642. నిష్కారణపు నవ్వే అది..
గమ్యంలేని ఆకాశంలా అనంతమై విస్తరిస్తూ..
నీ కన్నులకాంతిని తాకాలనుకుంటూ..

643. ఆనందం తాండవిస్తోంది తనువులో..
తారాతీరాన్ని ముద్దాడే అలలతో..
వెన్నెల్లో వాయులీనపు కలలతో..

644. నందనవనమే మది..
అల్లన వేణునాదమేదో నువ్వు వినిపిస్తుంటే..
రాధనై నే మురిసిపోయేవేళ..

645. గులాబీనని ఇప్పటికి గుర్తుకొచ్చింది..
ముళ్ళని నీవిప్పుడు ప్రస్తావించినందుకే..
నాలోని సున్నితత్వం కరిగిపోతున్నందుకేమో..

646. నేను ఆనందమై నర్తిస్తున్నాను..
నువ్వొచ్చే దారిదేనని గుర్తించినందుకే..
నీకై నిరీక్షణ సఫలమవుతుందనే నమ్మకంతోనే..

647. అక్షరశిల్పివయ్యావుగా..
శిలను శిల్పముగా మారుస్తానంటూ..
పదాలను అందంగా పేర్చేస్తూ

648. తాకేందుకే ఆలోచిస్తున్నా..
నీవో తాపంతో రగిలే విరహాగ్నివనే..
నీ వియోగానికి నేను ఆహుతి కాలేననే..

649. భగ్నప్రేమికుడి మనసుని గెలిపించాడుగా వరుణుడు..
మేఘాన్ని కదిలించి వలపుజల్లు కురిపించి..
విడిచిపెట్టిన ఆశను చిగురింపజేసి..

650. ఉదయపు వెన్నెల్లోనూ చూస్తున్నా..
రాలిపడే తారేదైనా ఉంటుందేమోనని.. 
మనసులోని కోరికను తీరుస్తుందేమోనని..

651. మోహంతో మనసును ముంచెత్తకలా..
సిగ్గులు సరిహద్దులు చెరిపేసేలా..
మనసును మహేంద్రాజలంతో మంత్రించేలా..

652. నా చెక్కిలిపై చుక్క మెరుస్తోంది..
నీ కన్నుల్లోని ఆనందం ఒలికిందనే..
మనసాపలేని అమృతం ఒడిసిపట్టిందనే..

653. మనసు ఉరకలేస్తోంది బాల్యంలోకి..
జ్ఞాపకాల దొంతరల చేతులు పట్టుకొని..
కదలని తనువును కసిదీరా తిట్టుకుంటూ..

654. వాడిపోయిన పువ్వూ పరిమళిస్తుంది..
దానికున్న అస్తిత్వాన్ని మనం గమనించగలిగితే..
రెట్టింపైన దాని విలువను గుర్తించగలిగితే..

655. విసిరే చూపు వలలు వేస్తున్నది..
కొసరే నవ్వు అలలై చేరుతున్నది..
పున్నమి రాత్రని గుర్తుచేయాలనే కదూ..

656. మనోఫలకంపై ముద్రించుకున్నా..
నీ పెదవులు రాసిన ప్రేమలేఖలు..
మన అనుబంధానికి సాక్షిగా..

657. వెతలన్నీ మనసుకే..
కలలో నిన్ను రప్పించాలంటే కునుకును ఆహ్వానించడం..
పగలైనా ఫర్వాలేదంటూ మూయనిరెప్పలను బ్రతిమాలడం..

658. నీ పిలుపుకి స్పందించి వచ్చా..
నీ ఒంటరితనం విరిచేందుకు..
నేనున్నానని గుర్తుచేసేందుకు..

659. నన్ను నేను కోల్పోయానన్న బాధలేదు..
నీ మనసులో భద్రమని తెలిసిపోయాక..
ఇరువురమొకటేనని అవగతమయ్యాక..

660. పెనవేసుకున్న అనుబంధమెప్పటికీ శాశ్వతమే..
బంధం ఊపిరాగి చెదిరిపోయినా..
నీ అనుభూతిలోనే సజీవమై తారాడుతూ..

 ............................... *****************.............................

No comments:

Post a Comment