Tuesday, 17 November 2015

త్రిపదాలు : 721 to 740

 ............................... *****************.............................

721. జావళీలుగా మార్చేసుకున్నా జ్ఞాపకాలను..
నీ ఊసలను పల్లవిగా మార్చుకొని..
విరహంలో వేసారక పాడుకోవాలనే..

722. అలలా ఎగిసిపడుతున్న ప్రేమ..
ఆరుకాలాలూ నీతోనే జీవితమంటూ..
అరుణోదయాలన్నీ మన సొంతమేనంటూ..

723. చెమట విలువ తెలిసినవాడేమో..
నుదిటిరాతను అలవోకగా కడిగేసుకుంటూ..
శ్రామిక జీవనానికి ఉదాహరణగా వాడు..

724. ఆవేదన ప్రతిధ్వనిస్తోంది..
నీ వియోగాన్ని ఓర్చుకోలేని వెన్నెలరాత్రి..
ఒంటరినక్షత్రమై నేను మిగిలినందుకే..

725. చితిమంటేసావెందుకో చెలిమికి..
ఆవేదనా గ్రీష్మంలో ఆసరా కాలేదనా..
ఆనందపు శరత్తులో వెన్నెల పంచలేదనా..

726. పారవశ్యంతో మూతబడుతున్న కన్నులు..
నీ చేతిలో వీణగా నన్ను నేను మలచుకుంటూ..
మనమే రసజగమైనట్లు ఊహలూగుతూ..

727. ఆనందాన్ని వెల్లవేస్తున్నా..
నీ విరహంలో నల్లబడ్డ మోముకి..
చిరునవ్వును పెదవంచున చేర్చి..

728. ప్రయత్నాన్ని మాత్రమే నమ్ముకున్నా..
లక్ష్యానికి స్వయంకృషి జోడించాలని..
గెలుపోటముల నిర్ణయం దైవానికొదిలి..

729. కన్నీటిని దొరలనీయను..
కాలం కరిగినా నాలోనే నీ రూపు కొలువుంచుకుంటూ..
కన్నులకు కోరిన సాంత్వనిస్తూ..

730. అలలా ఎగిసిన పేరంట..
కెరటాన్ని చేరగానే మాయమవుతూ..
తను నీటిలో రాసిన నా ప్రేమ చిరునామాలో..

731. మాట మౌనమవుతోంది..
మంత్రమై రాలే కన్నీటిబొట్టును ఆపలేదనే..
గొంతెత్తి వసంతాన్ని రప్పించలేననే..

732. కలలో కధలో..
తానే నా నాయకుడవుతూ..
ప్రేమలోకానికి అధిపత్యాన్ని వహిస్తూ..

733. నిద్దుర కరువవుతోంది..
కలలను కనలేని నా కనులను వెక్కిరిస్తూ ప్రతిరాత్రీ..
జ్ఞాపకాల అలజడితోనే తెల్లారిపోతూ..

734. అదే కల..
ప్రతిరాత్రి కలవరంతో నన్ను మేల్కొల్పుతూ..
నిద్దురపొద్దులు నిన్నే గుర్తుకుతెస్తూ..

735. చెలిమిని దిద్దుకున్నా అక్షరంతో..
లేపనం అక్కర్లేకనే గాయాన్ని మాయం చేసే నేర్పుందని..
కాలంతో పోటీ పడక నిలబడుతుందని..

736. రహస్యమవుతున్న జీవనం..
వాగ్దానానికీ వాస్తవానికీ మధ్య ఇమడలేక..
గమ్యమెరుగని చీకటిలో వెలుతురు వెతుకుతూ..

737. నల్లపూసగా మారిన ముత్యానివేమో నీవు..
కన్నీటిలో తప్ప కంటికి ఆనకుండా..
జ్ఞాపకానివై కనుగవ్వలలో దాగుండిపోతూ..

738. భావధారలో తడిచిపోతున్నా..
నువ్వు రాసేదంతా కవిత్వమని భావించినందుకే..
నీ ఆరాధన నాకని తలచినందుకే..

739. గమ్యమెరుగని పయనం..
అపస్వరమైన జీవితాన్ని శృతిచేసుకోవడం తెలియక..
మరింత నిస్పృహను వేంటేసుకు తిరుగుతూ..

740. కలం కదిలి కవితయ్యింది..
కాలాలూ గాయాలూ మరపించేలా..
గేయాలు మాత్రమే పల్లవించేలా..

 ............................... *****************.............................

No comments:

Post a Comment