Tuesday, 17 November 2015

త్రిపదాలు : 441 to 460

............................... *****************.............................
441. విచ్ఛిన్నమవుతూనే ఉన్నాయి బంధాలు..
సంబంధాలు నానాటికీ పతనమవుతూ..
మనసుపొరలు విడిచేకొద్దీ.. 

442. మరో ఆముక్తమాల్యదను తలచిందందుకే..
శ్రీకృష్ణదేవరాయలు నిన్ను ఆవహించినందుకే..
పదాలను నువ్వు ప్రబంధాలుగా మలచి రాసినందుకే..

443. భూలోకస్వర్గం సాక్షాత్కారమంట..
పచ్చనితోరణాలతో కళకళలాడే అవని పసిడిగడపలో.. 
 అచ్చెరువైన చిత్రమై కనులముందు నిలబడుతూ..

444. ప్రేమ పల్లవిస్తోంది..
మాట మూగబోయిందనే..
మౌనాన్ని అనువదించాలనే..

445. ముగ్ధగా మారిపోయా..
నీ తలపుల్లో మందారమై..
నీ కన్నుల ముందు జబ్బిల్లిలా..

446. ఏ బంధం ముడివేసిందో..
అనుబంధం గట్టిపడేలా..
స్నేహానికి చిరునామా మనమేనంటూ..

447. నువ్వెప్పుడూ చెట్టుమాదిరేగా..
కత్తిరించినా చిగురిస్తూ..
మరిన్ని చెట్లకు చోటిస్తూ..

448. అడుగుల జాడ కనిపిస్తోంది..
ఆయాసమని ఆగనప్పుడే..
అడుగులు వేలై అనంతమైనప్పుడే..

449. రెప్పల మాటున దాచేసా..
నా కలలు లోకువ కాకూడదని..
నిజమయ్యాక నీకు చూపాలని..

450. నెమలి పింఛానికెన్ని ఒయ్యారాలో..
ఇంద్రధనస్సును మించిన రంగులున్నవనేమో..
ఆపై గోవిందుని తలకెక్కిందనో..

451. ఏ పరికరాన్ని మెచ్చాలో..
మన మధ్య దూరాన్ని తగ్గిస్తూ..
దగ్గరున్న భావాన్ని నిరంతరం కలిగిస్తుంటే..

452. పచ్చకాగితానికి విలువ పెరిగింది..
రూపాయల లెక్కలే మిగిలిన దేశంలో..
ఘనాన్ని ద్రవ్యంగా మార్చుకుంటూ..

453. పందెంకోడిగా మారకుండా చూడాలి..
పంతాలు పెరిగే వేళల్లో..
పసిపిల్లలు ఎదిగే క్రమంలో..

454. మనసు గెలవడం మృగ్యమే..
విశృంఖలానికి అలవాటుపడ్డ మనిషితో..
అస్తిత్వపు విలువలెరుగని మనుగడలో..

455. జలకమాడిన చాలనుకున్నా..
అనుభూతుల మధువులలో ప్రవాహానికి ఉరకలెత్తక..
నీ పిలుపు జలపాతమై నన్ను పిలవగనే..

456. మనసుంటేనే తెలుస్తుందేమో..
మనసుకో విలువుంటుందని..
గుర్తించేవారు కరువైతే లోపం తనది కాదని..

457. చెదిరిన కాటుకకే తెలుసు..
నీ చూపు కలిసిన వేళ చంద్రశీతల స్పర్శానుభవం..
మెరిసిన భాష్పం వెనుక ఆనందం..

458. ఆలోచన అప్పుడే సఫలము..
అపోహలు లేని ఆచరణయోగ్యమైతే..
ఆ నలుగురికీ ఆమోదమైతే..

459. ..ఇంద్రధనుసునే దింపావో..
నెలవంకనే చూపావో..
నీలో ప్రకృతినే చూసానులే..

460. మనిషి విలువ పెరిగేది..
సంస్కారం ఉన్నప్పుడే..
వ్యక్తిత్వం బయటపడినప్పుడే..
.............................. *****************.............................

No comments:

Post a Comment