Tuesday, 17 November 2015

త్రిపదాలు : 481 to 500

............................... *****************.............................
481. నిండుకున్న నవ్వులను బ్రతిమాలాను..
వసంతాన్నిడిచి గ్రీష్మాన్ని చేరదీయొద్దని..
అరవిరిసిన పెదవులను వీడి పోవొద్దని..

482. కంచికే పోదామనుకున్నాను..
కలవరిస్తావనుకొని మిగిలుండిపోయాను..
కధగానైనా చదువుకుంటావని ఆశిస్తూ..

483. నా మీద నుంచీ వీచినప్పుడే అనుకున్నా..
చిలిపిగాలి అల్లరేదో చేసేందుకు నిన్ను చేరబోతోందని..
నా ఊసులతో నిన్ను ఉక్కిరిబిక్కిరి చేయడానికెళ్తుందని

484. కరిగిపోయింది కల..
మీనాక్షివని మోక్షమిస్తావనే భయంలో..
వాస్తవంలో జీవించాలనే.,.

485. నేటి వెతలన్నీ..
నిన్నటి తప్పులే..
రేపటిని హెచ్చరిస్తూ..

486. నేటి నిరాశలన్నీ..
రేపటి ఆశలను పూసుకొని..
నేడు నవ్వమని ఊరిస్తూ..

487. చిగురిస్తూనే ఉన్న మనోవనాలు..
శిశిరాలెన్నిసార్లు రాల్చాలని చూసినా..
మొలకెత్తాలనే పట్టుదలను పూసుకొని

488. విడిచేసా వెతలను..
రేపటి నమ్మకముతో..
నేడు ఆత్మవిశ్వాసాన్ని దిద్దుకుంటూ..

489. రాలిపోయేదందుకే కొన్ని ఆకులు..
మరిన్ని మొలకలకు చోటిచ్చేందుకు...
తన చెట్టునీడన మరిందరిని కాపాడేందుకే..

490. ఆనందభాష్పాలతో చిగురించావేమో..
వెతక్కుండానే నీ ఆచూకీ దొరికింది కనులకి..
కంటిపాపలో నిన్ను చూసుకుందామనుకున్నందుకు..

492. ప్రతిస్పందనలన్నీ మాలగా గుచ్చేసా..
మాలికగా మెడలోవేసి మురిపిద్దామనే..
మాలికలోనైనా అభిసారికను గుర్తిస్తావనే

493. నీ అంతరంగం బైటపడింది..
నా మనసద్దం పగిలినప్పుడే..
వేవేలరూపాలుగా నిన్ను దాచుకుని నన్ను కోల్పోయానని..

494. యుద్దాలన్నీ వ్యర్ధమేగా..
మార్పు ముందుగా మనలో మొదలవకుంటే..
ఎదుటివారు మారాలని ఆశించి ఎదురుచూస్తుంటే..

495. నోటితో పాటూ మనసూ పండింది..
నీ అధరపు తాంబూలం స్వీకరించినందుకే..
మల్లెలు సైతం సిగ్గుపడినందుకే..

496. నీవు నేర్పిన కళలే నాకన్నీ..
పేరులోనే పెన్నిధి దాచుకుంటూ..
మనసుతో హృదయాలను దోచుకుంటూ..

497. కనిపెడుతూనే ఉన్నా..
అనేక హృదయాల్లో నీవు మిగిల్చుకున్న జ్ఞాపకాల్ని..
అనేక మనసుల్లో నువ్వు ఉదయించిన స్వప్నానివని...

498. వానకోయిలతో కబురంపానందుకే..
నీ విరహానికి జతకమ్మని..
నా సంక్షేమం నీకు వివరించమని..

499. జాబిల్లి విస్తుపోయినప్పుడే తెలుసులే..
నీ నెలవంక ఒంపులన్నీ నన్ను చూసాక పుట్టినవని..
నీ అధరాల నవ్వులు నాకోసమేనని..

500. మనసు నవ్వుకుంది..
బాల్యంలోకి పయనించి స్మృతులను గిల్లుకున్నందుకే..
అలవికాని ఆనందాన్ని తడుముకున్నందుకే
............................... *****************.............................

No comments:

Post a Comment