Tuesday, 17 November 2015

త్రిపదాలు : 181 to 200

181. ఎన్ని నవవసంతాలో..
నీ క్రీగంటి చూపుల కావ్యాలలో..
నా మనసాడే మయూర నర్తనాలలో..
182. నా నువ్వు...నీ నేనే..
అనురాగాలని పాడేస్తూ..
అనుబంధమై పెనవేసుకుంటూ..
183. మూగమనసని నిందిస్తావే..
మౌనభాషని నేర్చిందనా..
నీరవంలో నిస్సహాయంగా నిలుచుందనా..
184. చిత్తరువై అచ్చెరువొందనా..
నా నీడగా తోడవుతానంటే..
నా రేపటికి బాట నువ్వేస్తానంటే..
185. నీటిముత్యాల వారధనుకుంట..
నిన్ను నన్ను కలిపి నిలిపింది..
నీ ఊసులను మదికి చేరవేసింది..
186. వసంతం వెల్లివిరిసింది..
నీ పిలుపుల నయగారాలలో..
నా వలపుల ప్రియరాగాలలో..
187. నీ పిలుపులే వినబడుతున్నాయి..
మధురగానం విన్న ప్రతిసారి..
నా మనసు ప్రతిస్పందించిన ప్రతిసారి..
188. భావుకత్వమే అనుకుంటా..
నిన్ను రాసిన ప్రతీసారీ..
అక్షరాలన్నీ కవితలై కనబడుతుంటే..
189. వసంతం చిగురించనంటోంది..
నీ చెలిమి చేదయ్యిందనో..
నీ వలపు దూరమయ్యిందనో..
190. జ్ఞాపకమెరుగదు నా హృదయం..
నిత్యసజీవమై నాలో నువ్వున్నందుకు..
నిన్ను వెతుక్కొనే రోజు నాకు రానివ్వనందుకు..
191. ఎందుకులే కోపాల్..తాపాల్..
అక్కర్లేని పట్టింపుల్..పలకరింపుల్..
ఎవరికీ పట్టని ఇజాల్లోని నిజాల్...
192. ఆహ్వానిస్తున్నా..
ఆనందంలోంచీ సంతోషంలోకి..
నీలోంచి నిన్ను నాలోకి...
193. ఎగిసిపడుతూనే ఉంది అల..
కెరటమై తీరాన్ని ముద్దాడేందుకు..
జీవితం కాలాతీతమని చెప్పేందుకు..
194. శిల్పిగా మారిపోయా...
శిలాక్షరాలు రాయాలనే..
నా వాక్యశిల్పంలో నిన్ను చూసుకోవాలనే..
195. అలరిస్తూనే ఉన్నా...
నీ ఊసుల అల్లికల పెనవేతల్లో..
నా ఊహకు సై అంటూ..
196. ఆకాశరంగం..
తలంటుకొందేమో..
మంచుధూపంతో తలార్చుకుంటుంది నీ మధురోహతో..
197. రెప్పలసవ్వడి రహస్యం తెలుసుకోలేకపోయా..
కోలాటం జరుగుతోందని సర్దుకుపోయా..
నీ చూపుకి బదులిస్తోందని అనుకోలా..
198. కలదిరుగుతున్నాయి కలహంసలు..
మనోవనాన్ని సరోవరం చేసి..
మనసైన విహారమనుకున్నందుకేమో..
199. మరందాలను నాసిక పసిగట్టినట్లు...
అరవిరిసిన పూలను తిలకించేమో..
నా మనసు భ్రమరమై నర్తిస్తోంది..
200. ఎవరు నేర్పారో వెన్నెలమ్మకు..
రేయి కాగానే ఉదయించమని..
మదికి మనోల్లాసం కలిగించమని..

No comments:

Post a Comment