Tuesday, 17 November 2015

త్రిపదాలు : 161 to 180

161. మౌనరాగాలెన్నో..
నీ మనసు తాళానికై ఎదురుచూస్తూ..
తెగిన వీణతీగలను సవరిస్తూ..
162. కన్నులకు జలుబేమిటో..
తడియారని తలపులతో తనువెల్లా ముంచేస్తూ..
నులివెచ్చని కన్నీటిని మనసంతా జల్లేస్తూ
163. నెమరువేస్తున్నా జ్ఞాపకాలను..
నీరెండలో నీడవుతాయని..
నేనింకా మిగిలున్నాననే నమ్మకానికి ఊపిరి పోస్తాయని..
164. అక్షరబద్దం చేస్తున్నా మన ఆనందాన్ని..
నీటి మీద రాతలు కాకూడదనే..
కూలిపోయే కాగితపు మేడ కాకూడదనే..
165. మనసుతోనే భావిస్తున్నా...
నీకు దగ్గరైన క్షణాన్ని..
మనలను కలిపిఉంచిన అనుబంధాన్ని..
166. నీరవానికి పరిచయమెందుకులే..
నీవు లేనప్పుడు రవళిస్తూనే ఉంటోందిగా...
నన్ను ఏకాకిగా మార్చేస్తూ..
167. నిన్నల్లో విడిచేసా నవ్వులన్నీ..
నీతోనే కరిగిపోయాయని..
మౌనాన్ని మాత్రం పెదవులకి అలంకరించుకొని..
168. చెమరించింది కాగితం..
కన్నీటిని రాస్తున్నావని..
తడియారే దారే లేదని..
169. గ్రీష్మాన్ని తలపిస్తోంది..
నీవు లేని వసంతం వాడిపోయి..
నీరన్నది దొరకని నడి వేసవిలో..
170. నీ పలుకులెంత మధురమో..
మకరందాన్ని మరిపిస్తూ..
తీయందనంలో నన్ను ముంచేస్తూ..
171. మనసుతో లిఖించా అక్షరాలను..
చెరిగిపోరాదనే..
భవిషత్తులో అమరమై ఉంటాయనే...
172. అధరాలకెంత తీయందనమో..
నీ పేరునే పలవరిస్తూ..
మదిలో నిన్నే జపిస్తూ..
173. ఎన్ని జ్ఞాపకాలని ఏరతావు..
స్మృతుల తీరం కెరటాలకు ఒరిగిపోతుంటే..
తలపులగవ్వలు సముద్రంలో మునిగిపోతుంటే..
174. మరపురాని బాధెక్కువైంది..
మధురమైన నీ జ్ఞాపకం కన్నా..
అనుక్షణం నన్ను వేధిస్తూ..
175. నీ హృదయంలో ప్రేమ కురిసిందేమో..
చెమరించిన నీ కన్నులకు తోడు..
వణుకుతున్న నా మనసే సాక్షిగా..
176. నిలబడిపోయా నిన్నల్లోనే..
నేడు నీ జాడ కనుమరుగయ్యిందనే..
రేపటి ఆశకి ఊపిరి పోసేదెవరనే..
177. నా కనుకొలుకుల్లో నీరు..
మన అనురాగ మేఘం కరిగి రాల్చిన చినుకులా..
కాలాతీత ప్రేమల చెమరింపులా..
178. సంతోషానికి సరిహద్దు చెరిపేసా..
ఆనందానికి నింగి హద్దవ్వాలని..
ఆనందభాష్పాలతో కన్నీరు రద్దవ్వాలని..
179. నిండుకున్నాయి నవ్వులు..
నీ విరహాన్ని వధించలేక..
నా చెక్కిళ్ళను వరించలేక..
180. మునిగిపోవాలనే ఉంది..
నీ తలపుల మకరందపు జడివానలో..
తీయందనం నచ్చిందనే..

No comments:

Post a Comment