Tuesday, 17 November 2015

త్రిపదాలు : 661 to 680

 ............................... *****************.............................
661. అవడానికి మనిషే..
అప్పుడప్పుడూ ముసుగేసుకుంటూ..
ఏ మాయ చేస్తాడో తెలియక..

662. వలపును కూస్తున్నవి..
వసంతం నిత్యమని భ్రమించిన మనోకోయిలలు..
వానాకాలానికీ అబేధాన్ని ఎరుగమంటూ..

663. అంతుచిక్కనివాడివేలే..
పాదరసమై పరుగులుపెడుతూ..
అందుకొనేలోపే అంతర్ధానమైపోతూ..

664. ముద్రించుకున్నానెప్పుడో మనోఫలకంపై..
నిన్న గడిచిపోయిన రోజులు..
నీతో కలిసి చేసిన అల్లరులు..

665. నేనెప్పుడూ నీతోనే..
చీకట్లో వెన్నెలగానైనా..
వెలుతురులో నీరెండగానైనా..

666. ఏకాంతాన్ని చవిచూస్తున్నా నేను సైతం..
నవ్యానుభవాల్ని సొంతం చేసుకుంటూ..
నాకో కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటూ..

667. ఒయ్యరమంతా పిల్లకాలువదే..
వడివడిగా ప్రవహిస్తూ..
బిరబిరమని సముద్రుడ్ని చేరేవేళలో..

668. సాగరానికందుకే అంత గర్వం..
నీలికోకతో ఆకట్టుకోగలదనీ..
పైమెరుగు గవ్వలనూ అద్దుకొని ఆకర్షిస్తోందని..

669. మనసుకెప్పుడూ ఉల్లాసమే..
నిన్ను చేరే కలల చిత్రాల్లో..
మరిన్ని నగిషీలు దిద్దుకుంటుంటే మనసుకుంచెతో..

670. నిత్యవసంతాన్నే..
నీ మనసుకు ఆమనినై..
కలకోయిల కూజితాలు జతచేసే నేను..

671. స్మృతులను వర్షిస్తున్నా..
నిన్ను జ్ఞాపకాలతో తడపాలనే..
నన్ను తుడిచిపెట్టకుండా గుర్తుంచుకుంటావనే..

672. జీవితమదేగా..
కాల భ్రమణంలో చిక్కుకుపోతూనే..
తిరిగి ప్రారంభమవుతూ..

673. ఓ క్షణం నిలబడిపోయా..
నిన్ను నాలోకి ఆవహించుకుంటూ..
నేనే నువ్వయిపోవాలనే గంపెడాశతో..

674. అక్షరాలన్నీ కలికితురాయిలే..
ఏ క్షేత్రంలో పండించావో పదాల్ని..
చదివేకొద్దీ చదవాలనిపిస్తూ..

675. నా సంకేతంలోనే సందేశాలు..
మనసెరిగిన మరో మనసుకి సంబరాలు..
ఊసులవెల్లువలోని రహస్యాలు..

676. నవవిధవిద్యలూ నీ ప్రేమలోనే..
మాటలతో నన్ను మరిపిస్తూ..
ముచ్చటగా మనసు గెలిచేస్తూ..

677. కొత్త ఉద్వేగానికి మేల్కొల్పులేగా..
అనుభవాన్ని రేపటి ఉత్సాహంగా మార్చుకొనే చొరవుంటే..
గెలుపువైపు అడుగులు పయనిస్తుంటే..

678. అనుభవాలన్ని విస్మరించేసా..
అనుభూతిలోపం ఎదురయ్యిందనే..
అనుమానాన్ని తుడిచేయలేకనే..

679. ఉక్కుమనుషులమేమో మనం..
భావాల్ని దాచేసి బరువుగా బ్రతికేస్తూ..
ఆనందాన్ని సైతం లోలోపలే గదిమేస్తూ.

680.ఒడిసిపట్టా నీ జ్ఞాపకాన్ని..
మధురంగా మనసులో మిగుల్చుకోవాలని..

నా కవితకు మకుటంగా రాసుకోవాలని..

 ............................... *****************.............................

No comments:

Post a Comment