Tuesday, 17 November 2015

త్రిపదాలు : 501 to 520

 ............................... *****************.............................
501. వెన్నెలెంత కందిపోయిందో..
నీ హృదయాన్ని తాకే సిగ్గులో..
తానే కరిగి నవనీతమైపోతూ..

502. రవ్వంత సవ్వడీ మాయమయ్యింది..
గోరంత చోటిమ్మని గుండెలో చేరి..
ఏకంగా శివతాండవమే చేస్తుంటే..

503. ఆమె నవ్వులో ఎప్పుడూ గెలుపే..
అప్పుడు పట్టుదలతో..ఇప్పుడు విజయంతో..
ఓటమికే ముచ్చెమటలు పట్టేలా..

504. ఆషాడమై కురుస్తున్నానందుకే..
వానకోయిల నీ కబురు తెచ్చిందిప్పుడేనని..
నా మనసులోనూ మబ్బులు ముసురుకున్నాయని.. 

505. భారాన్ని తేలిక చేద్దామనొచ్చుంటాయి భావాలు..
ఆలోచనకి అక్షరంగా మార్చేస్తావని..
తమకో అస్తిత్వం మిగులుస్తావని..

506. అరనవ్వుల మురిపాలే..
మనవైన సగపాలలో ఇద్దరిని ఒక్కటిచేస్తూ..
నీవే నేనని గుర్తుచేస్తూ..

507. మనసేదో గెలిచినట్లుంది..
నీ పెదవులపై నవ్వులు నర్తించగానే..
నయనాలు అరమోడ్పులై వాలగానే..

508. కన్నీటిబిందువులు రాలిపోతున్నాయి..
చెక్కిళ్ళపై సేద్యం తమవల్ల కాదంటూ..
మనసులోనే గుట్టుగా ఇంకిపోవాలని..

509. వెనుకకు తిరిగి చూడవెందుకో..
నీడై అనుసరించే నన్ను..
జన్మాంతరాలలోకి తొంగిచూసే తొందరలో..

510. విరిసెను నయనాన కమలాలు..
కందిన కోమల కపోలాలకే..
నర్తించిన మయూర హృదయానికే..

511. సీతాకోకా అపురూపమే..
ఎన్నో వెతలను దాటొచ్చిందని తెలియక..
కృషితో రూపసిగా మారిందని ఎరుగక..

512. నిత్యమల్లెదీ అదృష్టమే..
దైవారాధనకే దాసోహమవుతూ..
రోజు తప్పక ఉదయాన్నే వికసిస్తూ..

513. ఎన్నికళలు నేర్చిందో నీ గుండె..
అరవైఐదో కళగా మౌనాన్ని అనువదిస్తూ..
నా మౌనానికే గలగలలు నేర్పిస్తూ..

514. నిశ్శబ్దాన్ని వెంటేసుకు తిరుగుతావెందుకో..
మౌనమునిగా మనసులో శబ్దించేందుకా..
నీలోని శూన్యం నన్నావరించేందుకా..

515. నందివర్ధనం నయనమంటినట్లుంది..
నీ అధరచుంబనపు సెగలు సోకుతుంటే..
నులివెచ్చని భావమేదో మనసు తాకుతుంటే...

516. మౌనరహస్యాన్ని అన్వేషిస్తున్నా..
నాలో నన్ను కనుగొనలేక..
నీలో నన్ను వెతుక్కోలేక..

517. ప్రేమంటే నన్ను గెలవడం కాదు..
ఏకాంతంలో నీలో నన్ను కనుగొనడం..
కాలాన్నీఎ దూరాన్నీ లెక్కచేయక పోవడం..

518. దయలేని మేఘాలెన్నో..
సందేశాలు మోయడం తప్ప కర్తవ్యాన్ని మరచి తరలిపోతూ..
ఆషాడన్ని పూర్తిగా గ్రీష్మసెగలకే అంకితమిస్తూ..

519. చిగురాకుల నవ్వులు..
చిటపట చినుకులకి స్వాగతమిస్తూ..
చిన్నారి పువ్వులను పులకరింపజేస్తూ..

520. ప్రేమ చిరునవ్వులాంటిదే..
ఎన్ని కష్టాలున్నా బ్రతకాలనుకొనేది..

పేలవమైనా పెదవంచునే తారట్లాడేది..

 ............................... *****************.............................

No comments:

Post a Comment