Tuesday, 17 November 2015

త్రిపదాలు : 741 to 760

 ............................... *****************.............................

741. వలపు సుమగంధమే..
అలసిన మనసుకి అనురాగం అలదేస్తూ..
దిగులుమేఘాలను దూరంగా తరిమేస్తూ..

742. మౌనాన్ని సాగనంపమంటున్నా..
రసమయ సరసాక్షరాలతో సావాసం చేయిద్దామని..
మౌనమునివైన నీ వాలకం చూడలేకనే..

743. పదేపదే పాడుతోంది మనసు..
నువ్వు పాడిన నిన్నటి పాట..
రేపటి ఆశను బ్రతికించుకొనేందుకు..

744. నీ జ్ఞాపకాల నెత్తావులే..
నా శ్వాసలో చేరి ఊపిరందిస్తూ..
గతానికి గంధం పూసి అలరిస్తూ..
745.


 ............................... *****************.............................

త్రిపదాలు : 721 to 740

 ............................... *****************.............................

721. జావళీలుగా మార్చేసుకున్నా జ్ఞాపకాలను..
నీ ఊసలను పల్లవిగా మార్చుకొని..
విరహంలో వేసారక పాడుకోవాలనే..

722. అలలా ఎగిసిపడుతున్న ప్రేమ..
ఆరుకాలాలూ నీతోనే జీవితమంటూ..
అరుణోదయాలన్నీ మన సొంతమేనంటూ..

723. చెమట విలువ తెలిసినవాడేమో..
నుదిటిరాతను అలవోకగా కడిగేసుకుంటూ..
శ్రామిక జీవనానికి ఉదాహరణగా వాడు..

724. ఆవేదన ప్రతిధ్వనిస్తోంది..
నీ వియోగాన్ని ఓర్చుకోలేని వెన్నెలరాత్రి..
ఒంటరినక్షత్రమై నేను మిగిలినందుకే..

725. చితిమంటేసావెందుకో చెలిమికి..
ఆవేదనా గ్రీష్మంలో ఆసరా కాలేదనా..
ఆనందపు శరత్తులో వెన్నెల పంచలేదనా..

726. పారవశ్యంతో మూతబడుతున్న కన్నులు..
నీ చేతిలో వీణగా నన్ను నేను మలచుకుంటూ..
మనమే రసజగమైనట్లు ఊహలూగుతూ..

727. ఆనందాన్ని వెల్లవేస్తున్నా..
నీ విరహంలో నల్లబడ్డ మోముకి..
చిరునవ్వును పెదవంచున చేర్చి..

728. ప్రయత్నాన్ని మాత్రమే నమ్ముకున్నా..
లక్ష్యానికి స్వయంకృషి జోడించాలని..
గెలుపోటముల నిర్ణయం దైవానికొదిలి..

729. కన్నీటిని దొరలనీయను..
కాలం కరిగినా నాలోనే నీ రూపు కొలువుంచుకుంటూ..
కన్నులకు కోరిన సాంత్వనిస్తూ..

730. అలలా ఎగిసిన పేరంట..
కెరటాన్ని చేరగానే మాయమవుతూ..
తను నీటిలో రాసిన నా ప్రేమ చిరునామాలో..

731. మాట మౌనమవుతోంది..
మంత్రమై రాలే కన్నీటిబొట్టును ఆపలేదనే..
గొంతెత్తి వసంతాన్ని రప్పించలేననే..

732. కలలో కధలో..
తానే నా నాయకుడవుతూ..
ప్రేమలోకానికి అధిపత్యాన్ని వహిస్తూ..

733. నిద్దుర కరువవుతోంది..
కలలను కనలేని నా కనులను వెక్కిరిస్తూ ప్రతిరాత్రీ..
జ్ఞాపకాల అలజడితోనే తెల్లారిపోతూ..

734. అదే కల..
ప్రతిరాత్రి కలవరంతో నన్ను మేల్కొల్పుతూ..
నిద్దురపొద్దులు నిన్నే గుర్తుకుతెస్తూ..

735. చెలిమిని దిద్దుకున్నా అక్షరంతో..
లేపనం అక్కర్లేకనే గాయాన్ని మాయం చేసే నేర్పుందని..
కాలంతో పోటీ పడక నిలబడుతుందని..

736. రహస్యమవుతున్న జీవనం..
వాగ్దానానికీ వాస్తవానికీ మధ్య ఇమడలేక..
గమ్యమెరుగని చీకటిలో వెలుతురు వెతుకుతూ..

737. నల్లపూసగా మారిన ముత్యానివేమో నీవు..
కన్నీటిలో తప్ప కంటికి ఆనకుండా..
జ్ఞాపకానివై కనుగవ్వలలో దాగుండిపోతూ..

738. భావధారలో తడిచిపోతున్నా..
నువ్వు రాసేదంతా కవిత్వమని భావించినందుకే..
నీ ఆరాధన నాకని తలచినందుకే..

739. గమ్యమెరుగని పయనం..
అపస్వరమైన జీవితాన్ని శృతిచేసుకోవడం తెలియక..
మరింత నిస్పృహను వేంటేసుకు తిరుగుతూ..

740. కలం కదిలి కవితయ్యింది..
కాలాలూ గాయాలూ మరపించేలా..
గేయాలు మాత్రమే పల్లవించేలా..

 ............................... *****************.............................

త్రిపదాలు : 701 to 720

 ............................... *****************.............................

701. యుగళగీతాన్ని మరచిపోయా..
నీ విషాదంలో నేను కూరుకుపోయి..
నువ్వు పాడే రాగాలకు అర్ధాలు వెతుక్కుంటూ..

702. తాత్కాలికంగా మానిందేమో మనసు గాయం..
అంతర్నిహితంగా అంతమయే సమస్యే లేనందుకు..
నిన్ను తలచే క్షణాలు తనకు బరువు కాదంటూ..

703. మమేకమేగా మనమిద్దరం..
ఒక్కరిలో ఒకరమై వీడని లోకమయ్యాక
ప్రేమలోకం మనదేనని అందరూ ఒప్పుకున్నాక..

704. వధించాలనుకున్నా ప్రేమను..
శిశిరమైన విరహం నన్నిడిచిపెట్టేలా లేదని..
వియోగం శాశ్వతం కాబోతోందని భయపడి..

705. శాశ్వతమయ్యింది దిగులు..
వసంతంలా నువ్వొచ్చి శిశిరానికి నన్నిడిచిపెట్టాక
ఋతువులను మరచిపోయిన వియోగిలా నన్ను మార్చేసి

706. గుండె కవాటం తెరిచుంచావుందుకో..
మరెవరికైనా రావాలనిపిస్తే రావొచ్చంటూ..
ఊహించని ఆహ్వానాన్ని మన్నించమంటూ..

707. పండువెన్నెలయ్యింది సంతోషం..
దిగులు మేఘాలను అలవోకగా తరిమావనే..
మనసుకు మరచిన పున్నమిని గుర్తుచేసావనే..

708. దిగులొచ్చి పోతేనేముందిలే..
పెదవులకు పువ్వుల మెత్తదనాన్ని పరిచయించిందిగా..
లావణ్యపు తొలి అనుభూతిని మిగిల్చిందిగా..

709. దిగులుకీ శిశిరానికీ తేడా ఏముందిలే..
హృదయం పగిలినా ఎండినా బీటలేగా..
మనసు చిగురిస్తుందన్న నమ్మకమేదని..

710. పసిడి వన్నెలు గుర్తుకొస్తున్నాయి..
పసిదనానికి చేరువ చేసావనే..
పాలనవ్వులు తేలి పెదవులపైకొచ్చాయనే..

711. నీ కంటిమోహనమే ముగ్ధమయ్యిందేమో..
ఆనందభైరవిలో ఆలపిస్తోంది నా మోవి..
నీ చూపుల మధురిమలింకా కావాలంటూ..

712, మనసపురూపమని తెలీనందుకేమో..
ఆరాధన వ్యర్ధమవుతుంది కొందరి జీవితాలలో..
బ్రతకడాన్ని జీవించడానికి దూరం చేసేస్తూ..

713. భాద్రపదమని మరచినట్లున్నావు..
పుష్యాన్ని ముగ్గుల్లో పూయించాలనే తొందరలో..
నీ నవ్వులనే ముంగిట్లో రాల్చేస్తూ..

714. మౌనవించాను..
జ్ఞాపకాల వెన్నెలను ఏకాంతంలోనే ఆస్వాదించాలని..
నీ తలపుల మధురిమను పూర్తిగా గ్రోలాలని..

715. చేజారిన అనుభూతులు కొన్ని..
శిశిరమై రాలిపోతూ..
వసంతానికెప్పుడూ ఆమడదూరంలోనే ఆగిపోతూ..

716. అక్షరవెన్నెల కురుస్తోంది..
చడీ చప్పుడూ లేక కమ్మగా ఎదలో..
అలౌకికమైన ఆనందాన్ని సొంతం చేస్తూ..

717. అన్వేషణ సాగిస్తున్నా..
జ్వలిస్తున్న మనసులోని ఆవేదన ఆపేదెలాగని..
అక్షరాలసాయం కోసమని నివేదిస్తూ..

718. ఎదురుచూపులు భారమయ్యాయి..
నీవు తిరిగొచ్చే జాడలేక..
కోల్పోయిన మనసిక రాదనుకొని భంగపడుతూ.

719. అక్షరదాహమెన్నటికి తీరేనో..
రసవాహినిలో రేయింబవళ్ళు మనసు తేలియాడుతున్నా..
ఎన్ని శిశిరాల్ని చిగురింపజేసే ఊహలల్లుతున్నా..

720. అసూయను తరిమేస్తే సరిపోతుందేమో..
మనసులో ప్రేమకిరణాలొచ్చి వెలిగేందుకు..

అంతరాత్మకు నిజమైన ఆనందాన్ని పరిచయించేందుకు..

 ............................... *****************.............................

త్రిపదాలు : 681 to 700

 ............................... *****************.............................

681. గమ్యమెప్పుడూ గెలుపేగా..
అడుగులు తడబడక ముందుకే సాగుతుంటే..
లక్ష్యమే దారిచూపి రమ్మంటుంటే...

682. వసంతం చిగురేసేదెన్నడులే..
శిశిరాన్ని తలచుకొని రాత్రులన్నీ పొద్దుపుచ్చుతుంటే..
మనసుకు సాంత్వనమన్నదే దూరమవుతుంటే..

683. అలసిన మానసిక స్పందనలు కొన్ని..
నిన్ను మేల్కొల్పాలని తాము నిద్దురపోతూ..
వసంతాన్ని కలలోనే ఊహిస్తూ..

684. మనుషులిఎందుకు నేర్చుతారో వికారాలు..
మనసుకెన్నడు తెలియని అరమరికలు..
అద్దంలాంటి హృదయానికి మరకలంటిస్తూ..

685. అరవిరిసిన పువ్వైనందుకేమో మోము..
ఇంద్రుడివై తాగేస్తున్నావు అందమంతా..
రెండుకళ్ళు చాలవన్నట్లు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని..

686. నిశ్శబ్ద యుద్ధమెందుకో..
అలరించే అనురాగం వలయమై నిన్నల్లగా..
నీలో చైతన్యమై నేనిండగా..

687. పెదవి దాటని తపనలెన్నో..
గొంతులో తడారిపోయి..
శోకతప్తమై హృదిలో పొంగిపోతూ..

688. నింగిలోని మామే..
అందరికీ మాలిమై..
మేనమామగా చేరువై పూజలందుకుంటూ..

689. మనోవనానికెంత ఉల్లాసమో..
పిల్లగాలివై నువు పలకరించాక..
వెతలు వీడి నిన్ను పీల్చుకున్నాక..

690. గమ్యం తెలియని నా భావాలు..
రాదారిని పూలదారిగా మార్చుకు పయనిస్తూ..
ఎన్నో మనసులను స్పృశించి మురిపిస్తూ..

691. దయార్ద్రమైనదే కాలం..
ఒడిదుడుకులను ఓర్చుకొని నిరాడంబరంగా కదిలిపోతూ..
మానసిక గాయాలకు సైతం వైద్యం చేస్తూ..

692. నీ భావాలకెన్ని భాష్యాలో..
చదివేకొద్దీ కొత్త అనుభూతినిస్తూ..
నాలో కొత్త ఆలోచన రేకెత్తిస్తూ..

693. అనువదిస్తున్నా అపశృతిని..
నువ్వు పాడేలా అరమరిక చేద్దామని..
రాగాలలో తాళాన్ని మరికాస్త మార్చి..

694. నీ మౌనరాగం నేనేగా..
పెదవిప్పకున్నా కన్నులతో పాడేస్తూ..
నా హృదివీణను వాద్యసహకారం అడుగుతూ..

695. ఉక్కిరిబిక్కిరవుతోంది మది..
నీ నిశ్వాసలోంచీ నన్ను తరిమేసాక..
మరొకరి ఊపిరిలో చేరలేక..

696. కలలకు రంగులొచ్చాయి..
రాతిరి నువ్వొచ్చి సీతాకోకలా తిరుగాడినందుకే..
అనుకోని వెలుతురు పరచుకున్నందుకే..

697. ఎంత గర్వమో నా మనసుకి..
నిన్ను చుట్టూరా తిప్పుకొని అల్లుకుపోతుంటే..
లతవై నువ్వు పెనవేసుకుపోతుంటే..

698. మల్లెలు చల్లినట్లున్న వెన్నెల్లో..
తెల్లని మీగడ తరకల్లో..
మంచుతెరలా ఎగిసింది మన ప్రేమ..

699. ఈనాటి కలల పరిచయమే..
రేపటికి మరో ప్రపంచం..
మనదైన మనసైన ప్రేమలోకం..

700. మనసున విత్తే కలుపుమొక్కలు కొన్ని..
నీరు లేకుండానే వృక్షాలై ఎదిగిపోతూ..

ఉన్న కాస్త తడినీ పూర్తిగా పీల్చేస్తూ..

 ............................... *****************.............................

త్రిపదాలు : 661 to 680

 ............................... *****************.............................
661. అవడానికి మనిషే..
అప్పుడప్పుడూ ముసుగేసుకుంటూ..
ఏ మాయ చేస్తాడో తెలియక..

662. వలపును కూస్తున్నవి..
వసంతం నిత్యమని భ్రమించిన మనోకోయిలలు..
వానాకాలానికీ అబేధాన్ని ఎరుగమంటూ..

663. అంతుచిక్కనివాడివేలే..
పాదరసమై పరుగులుపెడుతూ..
అందుకొనేలోపే అంతర్ధానమైపోతూ..

664. ముద్రించుకున్నానెప్పుడో మనోఫలకంపై..
నిన్న గడిచిపోయిన రోజులు..
నీతో కలిసి చేసిన అల్లరులు..

665. నేనెప్పుడూ నీతోనే..
చీకట్లో వెన్నెలగానైనా..
వెలుతురులో నీరెండగానైనా..

666. ఏకాంతాన్ని చవిచూస్తున్నా నేను సైతం..
నవ్యానుభవాల్ని సొంతం చేసుకుంటూ..
నాకో కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటూ..

667. ఒయ్యరమంతా పిల్లకాలువదే..
వడివడిగా ప్రవహిస్తూ..
బిరబిరమని సముద్రుడ్ని చేరేవేళలో..

668. సాగరానికందుకే అంత గర్వం..
నీలికోకతో ఆకట్టుకోగలదనీ..
పైమెరుగు గవ్వలనూ అద్దుకొని ఆకర్షిస్తోందని..

669. మనసుకెప్పుడూ ఉల్లాసమే..
నిన్ను చేరే కలల చిత్రాల్లో..
మరిన్ని నగిషీలు దిద్దుకుంటుంటే మనసుకుంచెతో..

670. నిత్యవసంతాన్నే..
నీ మనసుకు ఆమనినై..
కలకోయిల కూజితాలు జతచేసే నేను..

671. స్మృతులను వర్షిస్తున్నా..
నిన్ను జ్ఞాపకాలతో తడపాలనే..
నన్ను తుడిచిపెట్టకుండా గుర్తుంచుకుంటావనే..

672. జీవితమదేగా..
కాల భ్రమణంలో చిక్కుకుపోతూనే..
తిరిగి ప్రారంభమవుతూ..

673. ఓ క్షణం నిలబడిపోయా..
నిన్ను నాలోకి ఆవహించుకుంటూ..
నేనే నువ్వయిపోవాలనే గంపెడాశతో..

674. అక్షరాలన్నీ కలికితురాయిలే..
ఏ క్షేత్రంలో పండించావో పదాల్ని..
చదివేకొద్దీ చదవాలనిపిస్తూ..

675. నా సంకేతంలోనే సందేశాలు..
మనసెరిగిన మరో మనసుకి సంబరాలు..
ఊసులవెల్లువలోని రహస్యాలు..

676. నవవిధవిద్యలూ నీ ప్రేమలోనే..
మాటలతో నన్ను మరిపిస్తూ..
ముచ్చటగా మనసు గెలిచేస్తూ..

677. కొత్త ఉద్వేగానికి మేల్కొల్పులేగా..
అనుభవాన్ని రేపటి ఉత్సాహంగా మార్చుకొనే చొరవుంటే..
గెలుపువైపు అడుగులు పయనిస్తుంటే..

678. అనుభవాలన్ని విస్మరించేసా..
అనుభూతిలోపం ఎదురయ్యిందనే..
అనుమానాన్ని తుడిచేయలేకనే..

679. ఉక్కుమనుషులమేమో మనం..
భావాల్ని దాచేసి బరువుగా బ్రతికేస్తూ..
ఆనందాన్ని సైతం లోలోపలే గదిమేస్తూ.

680.ఒడిసిపట్టా నీ జ్ఞాపకాన్ని..
మధురంగా మనసులో మిగుల్చుకోవాలని..

నా కవితకు మకుటంగా రాసుకోవాలని..

 ............................... *****************.............................

త్రిపదాలు : 641 to 660

 ............................... *****************.............................

641. మరణసదృశమేగా...
ఆ ఊపిరులలో ద్వేషమే నిండితే...
అపరిపక్వంగా మనసులో విషం చిమ్మితే..

642. నిష్కారణపు నవ్వే అది..
గమ్యంలేని ఆకాశంలా అనంతమై విస్తరిస్తూ..
నీ కన్నులకాంతిని తాకాలనుకుంటూ..

643. ఆనందం తాండవిస్తోంది తనువులో..
తారాతీరాన్ని ముద్దాడే అలలతో..
వెన్నెల్లో వాయులీనపు కలలతో..

644. నందనవనమే మది..
అల్లన వేణునాదమేదో నువ్వు వినిపిస్తుంటే..
రాధనై నే మురిసిపోయేవేళ..

645. గులాబీనని ఇప్పటికి గుర్తుకొచ్చింది..
ముళ్ళని నీవిప్పుడు ప్రస్తావించినందుకే..
నాలోని సున్నితత్వం కరిగిపోతున్నందుకేమో..

646. నేను ఆనందమై నర్తిస్తున్నాను..
నువ్వొచ్చే దారిదేనని గుర్తించినందుకే..
నీకై నిరీక్షణ సఫలమవుతుందనే నమ్మకంతోనే..

647. అక్షరశిల్పివయ్యావుగా..
శిలను శిల్పముగా మారుస్తానంటూ..
పదాలను అందంగా పేర్చేస్తూ

648. తాకేందుకే ఆలోచిస్తున్నా..
నీవో తాపంతో రగిలే విరహాగ్నివనే..
నీ వియోగానికి నేను ఆహుతి కాలేననే..

649. భగ్నప్రేమికుడి మనసుని గెలిపించాడుగా వరుణుడు..
మేఘాన్ని కదిలించి వలపుజల్లు కురిపించి..
విడిచిపెట్టిన ఆశను చిగురింపజేసి..

650. ఉదయపు వెన్నెల్లోనూ చూస్తున్నా..
రాలిపడే తారేదైనా ఉంటుందేమోనని.. 
మనసులోని కోరికను తీరుస్తుందేమోనని..

651. మోహంతో మనసును ముంచెత్తకలా..
సిగ్గులు సరిహద్దులు చెరిపేసేలా..
మనసును మహేంద్రాజలంతో మంత్రించేలా..

652. నా చెక్కిలిపై చుక్క మెరుస్తోంది..
నీ కన్నుల్లోని ఆనందం ఒలికిందనే..
మనసాపలేని అమృతం ఒడిసిపట్టిందనే..

653. మనసు ఉరకలేస్తోంది బాల్యంలోకి..
జ్ఞాపకాల దొంతరల చేతులు పట్టుకొని..
కదలని తనువును కసిదీరా తిట్టుకుంటూ..

654. వాడిపోయిన పువ్వూ పరిమళిస్తుంది..
దానికున్న అస్తిత్వాన్ని మనం గమనించగలిగితే..
రెట్టింపైన దాని విలువను గుర్తించగలిగితే..

655. విసిరే చూపు వలలు వేస్తున్నది..
కొసరే నవ్వు అలలై చేరుతున్నది..
పున్నమి రాత్రని గుర్తుచేయాలనే కదూ..

656. మనోఫలకంపై ముద్రించుకున్నా..
నీ పెదవులు రాసిన ప్రేమలేఖలు..
మన అనుబంధానికి సాక్షిగా..

657. వెతలన్నీ మనసుకే..
కలలో నిన్ను రప్పించాలంటే కునుకును ఆహ్వానించడం..
పగలైనా ఫర్వాలేదంటూ మూయనిరెప్పలను బ్రతిమాలడం..

658. నీ పిలుపుకి స్పందించి వచ్చా..
నీ ఒంటరితనం విరిచేందుకు..
నేనున్నానని గుర్తుచేసేందుకు..

659. నన్ను నేను కోల్పోయానన్న బాధలేదు..
నీ మనసులో భద్రమని తెలిసిపోయాక..
ఇరువురమొకటేనని అవగతమయ్యాక..

660. పెనవేసుకున్న అనుబంధమెప్పటికీ శాశ్వతమే..
బంధం ఊపిరాగి చెదిరిపోయినా..
నీ అనుభూతిలోనే సజీవమై తారాడుతూ..

 ............................... *****************.............................

త్రిపదాలు : 621 to 640

 ............................... *****************.............................
621. వెన్నెల కళనద్దుకున్నా..
చెలిమికి చిరునామాగా నిన్ను చేరేందుకే..
తారానేస్తమై నీకు తోడయ్యేందుకే..

622. మనసున్న రాజువే..
ఆయుధాలు పట్టకనే అంతఃశత్రువులను జయిస్తూ..
మానవత్వానికి మచ్చుతునకై వెలుగుతూ..

623. నిత్యమల్లెలా నేను..
నీ కలను అలంకరించే శుభవేళ..
నీ మనసును సైతం దోచేయాలనే..

624. ఉదయపు సింధూరంలా నేను..
నీ నుదిటిని చుంబించే సుప్రభాతాన..
అరుణరాగాలను అలవోకగా ఆలపిస్తూ..

625. నవపల్లవమై నవ్వుకున్నా..
ప్రియమారా నన్ను తాకినందుకే
అచేతనమైన నాలో చైతన్యం ఎగిసినందుకే..

626. నీవు రాసిన కావ్యాన్నే..
చదువరులకు చదివేకొద్దీ చదవాలనిపిస్తూ..
నీ కలానికి పదును పెట్టేస్తూ..

627. ప్రతిస్పందనాలే..
జన్మజన్మల పాపాలూ మజిలీల్లేక కొట్టుకుపోతూ..
జీవితాన్ని పునరావృత్తం చేసేస్తూ..

628. జీవితం చైతన్యం కోల్పోయింది..
కొట్టుకుపోతున్న జ్ఞాపకాలను విడిచేసి..
అడుగంటిన అనుభవాలు వెతుకుతున్నందుకేమో.. 

629. నీ అలౌకికస్పర్శకేనేమో..
వేదనలన్నీ వేణువులూదినట్లుగా మారిపోతూ..
గాయాలన్నీ గేయాలుగా మలచుకున్నట్లు..

630. కన్నీటికడలి ఆగనంటోంది..
చెలియలకట్ట వేసే చెలిమి చేయిచ్చిందని..
ఒంటరి జీవితానికి ఓదార్పు కరువయ్యిందని..

631. రాతిరి వెచ్చదనం తెలుస్తోంది..
గోరువెచ్చని సాహచర్యపు తాదాత్మ్యంలోనే..
రెండు మనసులు ఏకమైన సమ్యోగంలో..

632. ఎన్ని అలుకలు నేర్చిందో చిలిపివెన్నెల..
మన సరసానికి సూత్రధారి కాలేకపోయినందుకు..
తన అందంలో మనం ఒకటికానందుకు..

633. అడవిగాచిన వెన్నలనేగా..
నీడనై చాటుగా నిన్నెంత వెంటాడినా..
నువ్వే గుర్తించలేని నా నిస్సహాయతలో..

634. ప్రవచనాలుగా పల్లవిస్తాయేమో..
పరిపక్వత సాధించిన మానసిక సంఘర్షణలు..
శోకాలను శ్లోకాలుగా మార్చుకుంటూ..

635. కిరణాలకు దారిస్తున్నా..
నావైపు ఆకాంక్షగా ప్రసరిస్తూ ఉరికొస్తున్నాయని..
నా ఉదయాన్ని మహోదయంగా మలచాలనుకున్నాయని..

636. విహంగవీక్షణమే మదికి..
నీ భావాలు గువ్వలై ఎగిరొస్తుంటే..
నన్ను పసిపాపగా మార్చి మురిపిస్తూ..

637. ఊగిసలాడుతూ ఊపిరి..
నిన్ను చూసేదాక లోలోపలే కొట్టుమిట్టాడుతూ..
నా ప్రాణాలు హరించేలా గిలగిలలాడుతూ..

638. ఆ మనసులో అనుగ్రహవీచికలు వీచేదెన్నడో..
మానవత్వపు కొనవూపిరికి తర్పణాలెన్నడో..
ఆగిపోయిన ఆయువుకి శాంతెన్నడో..

639. కవిత్వాన్ని ఊపిరిగా రాసినందుకేమో..
రసహృదయాలను మీటుతూ గుబాళిస్తోంది..
నీపై నే రాసిన వెన్నెలకావ్యం..

640. ఊపిరినాపమంటావే..
నీ విరహాన్ని ప్రవహించేలా కీర్తిస్తుంటే..

నా వియోగానికి ఆజ్యం పోసేస్తూ..

 ............................... *****************.............................

త్రిపదాలు : 601 to 620

 ............................... *****************.............................

601. కలలు నిద్దుర లేస్తున్నాయి..
కునుకుపట్టినా మనసుకు కుదురివ్వకుండా..
నీ చిలిపితలపుల చేష్టలకేమో..

602. గడ్డిపువ్వు అస్తిత్వం తెలియని కొందరు..
కాలికింద నలిగినా చూసుకోని అల్పులు.. 
ప్రాణానికి వెలకట్టలేని మూర్ఖులు..

603. ఋతువుల రుచులకై వేచి చూస్తున్నా..
శిశిరం శాశ్వతం కాదని తెలిసినందుకే..
వాసంతసమీరానికి తొందరపడుతూ..

604.నీ మాటలూ నయగారాలే..
జలపాతమై కురుస్తూ..
బీడైన ఒంటరి మన్సును అభిషేకిస్తూ..

605. రాతిరికి తొందరెక్కువవుతోంది..
నీవే కలగా వస్తావని..
వేచిచూసే నా నిద్దురపొద్దులలో..

606. మరణాన్ని వేడుకుంటున్నా పిలుపునిమ్మని..
మరుజన్మకైనా మనసు కలవాలని..
ఈ జన్మ రుణాలు త్వరగా తెంచేయమని..

607. ఆశలపువ్వులు ఏరుతున్నా..
స్వప్నాలవీధిలో..
రేపటికి నిజమవుతాయనే..

608. ప్రతిమదిలో అంతులేని శోకాలే..
అంతరంగాన్ని మధించలేక..
నవ్వుతూ బతుకీడుస్తూ..

609. ఆసరా ఇచ్చిన అమ్మనే..
ఆసరాకి బహుమతిగా పంపిస్తూ..
కన్నప్రేమ చాటుకొనే ప్రబుద్ధులు..

610. నవ్వుకున్నా నీ భావుకతకి..
అనురాగ చినుకులనుకుంటూ..
శ్రావణమేఘాన్ని కలగంటున్నావని..

611. మబ్బుపట్టిన ఆకాశమే కనిపిస్తోంది..
మేఘావేశాన్ని చీకటిచేసి చూపాలనేమో..
జాబిల్లీ తారకలను తనలో దాచేస్తూ..

612. ఊహను మోహించినందుకేగా..
కలలను కాదనుకుంది మనసు..
నిద్దురను సైతం తోసిరాజంటూ..

613. నిత్యజ్ఞాపక ప్రవాహాలే..
మనసుకు కుదురునేర్పక ఉరకలు పెట్టిస్తూ..
జాగృదావస్థనీ స్వప్నస్థితికి లాకెళ్తూ..

614. నేటికి మరణమంట..
రేపటి పునర్జీవితానికై..
అత్యాశలను ఆసువుగా ఊహిస్తూ..

615. సద్దులేని సంగీతంలోని నువ్వులా..
మౌనవించిన మనసుతో నేనులా..
నీరవంలో నిట్టూరుస్తున్న ప్రకృతి..

616. మౌనం మంచిదే..
వాస్తవాన్ని ఆకళింపు చేసుకొనే ప్రయత్నంలో.. 
గొప్పగా ఆలోచిస్తూ సాధారణంగా జీవించడంలో..

617. మౌనశ్రోతగా నిలుచున్నా..
కీచురాళ్ళ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావని తిలకించి..
మాటలు మూగబోయిన ఆ క్షణాన..

618. నిన్నటి నేనే...
ఈరోజుకి మారిపోతూ..
రేపటికి ఎవరినవుతానో..

619. మళ్ళీ కూస్తున్న కోయిలనేగా..
ఆమని తిరిగొచ్చేవేళ..
మనసు మధుమాసమైనందుకు..

620. చందురుని చేపట్టిన అరచేతిలో..
అకాల సూర్యునివై ఉదయించావెందుకో.. 

ఏ మగువమనసును నులివెచ్చన చేసేందుకో..

 ............................... *****************.............................

త్రిపదాలు : 581 to 600

 ............................... *****************.............................

581. మనోవికారాలకి అతీతమే నీవు..
దర్పణమంటి స్వచ్ఛహృదయంతో...
నిజమైన చెలిమికి చిరునామా అవుతూ..

582. జీవితం మధురమే..
నీ మనసైన మాటలతో..
నీ ఆత్మీయతా చిలకరింపులో..

583. వియోగంలో విహరించినప్పుడే తెలిసింది..
కలనైనా నీకు దూరమవడం దుర్లభమని..
నీ తలపుల వెంటే నా పయనమని..

584. ఓటమి తిరిగిపోయింది..
గెలుపును హత్తుకొని నేను ముందడుగేసినందుకే..
నా ధైర్యానికి విస్తుపోయినట్లు

585. ప్రమోదమే మనసుకి..
అవసరమైన చెలిమిని అడక్కుండానే అందించావని..
వీడని స్నేహాన్ని పరిచయించావని..

586. సవ్యసాచే ఆమె..
పొత్తిళ్ళనుండీ ఒత్తిళ్ళవరకూ అతనికి చేయూతనిస్తూ.. 
కష్టసుఃఖాల్లో తోడవుతూ..

587. వెలిసిపోతున్న భావాలు..
అక్షరంలో మెరిసినా నువ్వు మురవలేదని..
నీ మనసు స్పందించే ఉపాయమే కరువయ్యిందని..

588. నీ పలకరింపే ఓ పరిమళం..
మధురభావాలను మేల్కొల్పుతూ..
ఇక వేరే గులాబులెందుకు మనమధ్య దండగ..

589. భావాలకు ఆజ్యం పోస్తున్నావు..
మనసంతా మల్లెకొమ్మేదో అల్లినట్లు..
నీవో ఆరాధకుడివా..కేవలం అతిథివా..

590. మనసు బీడయినప్పుడు తెలిసింది..
మనమధ్య పచ్చదనం రాలి చానాళ్ళయిందని..
చిగురించే ఆశ పూర్తిగా పోయిందని..

591. నిద్దురపొద్దులు మేలుకొనే ఉన్నా..
నీ అనుభూతులు ఆవహించినందుకేనేమో..
వెలుగురేఖలను సైతం విసుక్కుంటూ..

592. కోయిలకు కబురెట్టా..
శిశిరంలోనూ వసంతాన్ని నీకు వినిపిస్తుందని..
సరికొత్త రాగాలతో నిన్ను అలరిస్తుందని..

593. మృగతృష్ణే మిగులుతోంది విద్యావంతులకు..
ప్రతిభను ప్రోత్సహించలేని నేటిసమాజంలో..
అరకొర జీవితముతో సర్దుకుపోతూ..

594. చైత్రరధమొక్కటి పంపొచ్చుగా..
శిశిరానికి రాలేక వణుకుతున్నా..
మధ్యలో చెరుకొకటి చల్లదనంతో చంపేస్తుంటే..

595. గంజాయివనంలో తులసివని గ్రహించి ఉంటాడు..
విలువైన అక్షరాలను మాకు కానుకివ్వలని..
విభిన్నంగా పన్నీరు పోసి పెంచాడు నిన్ను తోటమాలి..

596. జీవించే ఉంటానుగా..
నే మరణించినా నీ జ్ఞాపకాలో అక్షరసజీవమై..
మనసు పుటలు నువ్వెతుకగానే అగుపడుతూ..

597. పాదరసాన్ని పట్టించావేమో అందాల జాబిల్లికి..
నాలా మారి నీలో దాగాలని..
గగనం వీడి నిన్ను చేరిందందుకే మరి..

598. మాటలతో గాయాలెందుకులే..
మదిలోని అశ్రువులు అనంతమై ప్రవహించేలా..
చెలియలకట్ట వేయడం చేతగాని చెక్కిళ్ళు తడిచేలా..

599. మాట తూలడం ఎంత అలవాటో..
అమృతం తాగుతామని చెప్పుకుంటూ..
విషం చిమ్మే మనుషులకి..

600. మృత్యుకిరీటం సంగతి మరచినందుకేమో..
సింహాసనం అలంకరించినందుకు అబ్బురపడుతూ..

జీవితానికి రారాజుననుకుంటూ వాడు..


 ............................... *****************.............................